డిజిటల్ ప్రపంచంలో మహిళలే టాప్.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు!

  • పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగంలో పురుషుల కంటే మహిళలదే ఆధిపత్యం
  • ఈ-కామర్స్, వినోద కార్యక్రమాల్లో వారే ఎక్కువ సమయం గడుపుతున్న వైనం
  • వేగంగా విస్తరిస్తున్న ఏఐ యాప్‌ల వాడకం
  • సోషల్ మీడియాలో యువత.. వినోదంలో 35 ఏళ్లు పైబడిన వారు ముందు
  • వీటీఐఓఎన్, ఐఏఎంఏఐ సంయుక్త నివేదికలో కీలక వివరాలు వెల్లడి
భారత పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ కార్యకలాపాల్లో పురుషుల కంటే మహిళలే ముందున్నారని ఓ తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్, మెసేజింగ్, ఈ-కామర్స్ వంటి విభాగాల్లో మహిళలు ఎక్కువ సమయం గడుపుతూ డిజిటల్ వినియోగంలో కీలక చోదకులుగా నిలుస్తున్నారని స్పష్టం చేసింది.

కన్స్యూమర్ బిహేవియర్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ వీటీఐఓఎన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. ఈ-కామర్స్, క్విక్ కామర్స్ విభాగాల్లో మహిళలదే పైచేయి అని నివేదిక పేర్కొంది. 25-34 ఏళ్ల వయసున్న పట్టణ మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌లపై రోజుకు సగటున 35.2 నిమిషాలు గడుపుతుండగా, అదే వయసు పురుషులు కేవలం 24.8 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నారు. ఇది పురుషుల కంటే 42 శాతం అధికం. వినోద కార్యక్రమాల కోసం మహిళలు రోజుకు సగటున 82.4 నిమిషాలు కేటాయిస్తున్నారు.

ఈ నివేదికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్‌ల వినియోగం కూడా వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. ఏప్రిల్ 2025 - మార్చి 2026 మధ్య కాలంలో ఏఐ యాప్‌ల వాడకం 100 శాతానికి పైగా వృద్ధి చెందింది. పట్టణ వినియోగదారులు రోజుకు సగటున 11.3 నిమిషాలు ఏఐ యాప్‌లపై గడుపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో 18-24 ఏళ్ల యువత రోజుకు 120 నిమిషాలు గడుపుతుండగా, 35 ఏళ్లు పైబడిన వారు వినోదంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పేమెంట్ యాప్‌ల వినియోగం మాత్రం అన్ని ఆదాయ వర్గాల్లో దాదాపు సమానంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా స్మార్ట్‌ఫోన్‌ల డేటాను విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించారు.

Digital India
Indian women
digital activities
e-commerce
online entertainment
AI apps
VTION
IAMAI
consumer behavior
digital consumption

More Telugu News